Rayapati: బ్రేకింగ్... రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు!
- పోలవరం కాంట్రాక్టును దక్కించుకున్న ట్రాన్స్ ట్రాయ్
- ఆపై సబ్ కాంట్రాక్టులకు పనులు
- బ్యాంకుల నుంచి భారీగా రుణం
- తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంక్ ఫిర్యాదు
- రాయపాటి ఇల్లు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఇంటితో పాటు ఆయన సంస్థలపై ఈ ఉదయం నుంచి సీబీఐ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, గుంటూరు నగరాల్లోని రాయపాటి ఇల్లు, కార్యాలయాలతో పాటు ట్రాన్స్ ట్రాయ్ సంస్థలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాయపాటికి వాటాలు ఉన్న ట్రాన్స్ ట్రాయ్ కి గతంలో పోలవరం కాంట్రాక్టు దక్కిందన్న సంగతి విదితమే. అయితే, కొన్ని సమస్యల కారణంగా, ఇతర కంపెనీలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చి పోలవరం పనులను ట్రాన్స్ ట్రాయ్ కొనసాగించింది. ఇదే సమయంలో బిజినెస్ పేరిట బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించడంలో ట్రాన్స్ ట్రాయ్ విఫలమైంది. ఈ విషయమై గతంలోనే సీబీఐ కేసును నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే నేడు దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగిన రాయపాటి సాంబశివరావు, ఐదుసార్లు లోక్ సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి, నరసరావుపేట నుంచి ఎంపీగా గెలిచారు. ఆపై 2019 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కాగా, తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో రాయపాటి సంస్థలు విఫలం అయ్యాయని ఇండియన్ బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనూ పలు బ్యాంకులు రాయపాటి సంస్థలపై ఫిర్యాదు చేశాయి. ఆపై రామ్ మాధవ్ సహా పలువురు బీజేపీ నేతలు రాయపాటి ఇంటికి వెళ్లి చర్చలు జరపడంతో ఆయన బీజేపీలో చేరుతారన్న వ్యాఖ్యలు వచ్చాయి. కానీ, ఆయన మాత్రం బీజేపీలో చేరలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ దాడులు జరుగుతుండటం చర్చనీయాంశమైంది.