Pawan Kalyan: అక్కడే తిరుగుతున్న జగన్ శ్రీకాకుళం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు: పవన్ కల్యాణ్
- అమరావతిలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ జరిపించండి
- కొందరిపై ఉన్న కోపాన్ని అందరిపై చూపిస్తే ఎలా?
- ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఇప్పుడు కథలు చెబుతున్నారు
అమరావతిపై వైసీపీకి ఎందుకంత కక్ష అనేది తనకు అర్థం కావడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారికి అవసరమైన వాటిని మాత్రం తరలించరని... ప్రజలకు అవసరమైన వాటిని తరలిస్తారని విమర్శించారు. అమరావతిలో అవకతవకలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంటే... వాటిపై విచారణ జరిపించాలని అన్నారు. తప్పులు చేసిన వారిని శిక్షించాలని... దీన్ని ఎవరు కాదంటారని చెప్పారు.
ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మీరు భావిస్తున్నప్పుడు విచారణ జరిపించాలని అన్నారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో ఉందని... అవకతవకలను రుజువు చేయడం ఎంతసేపని చెప్పారు. కొందరిపై మీకున్న కోపాన్ని ప్రజలందరిపై చూపిస్తామంటే ఎలాగని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం బాధాకరమని అన్నారు. ఎర్రబాలెంలో రాజధాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖను హుదూద్ తుపాను అతలాకుతలం చేస్తే కృష్ణా జిల్లా నుంచి అనేక రూపాల్లో కోట్లాది రూపాయల సహాయం వైజాగ్ కు వెళ్లిందని పవన్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాపై తిత్లీ తుపాను పంజా విసిరినప్పుడు లక్షలాది మందితో జనసేన అక్కడ కవాతు చేసిందని... ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఒక్క వైసీపీ నాయకుడు కూడా అప్పుడు ముందుకు రాలేదని... ఇప్పుడు వాళ్లంతా కథలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో విజయనగరం జిల్లాలో తిరుగుతున్న జగన్... పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు.
రాజధాని ఎక్కడో వైసీపీ స్పష్టమైన ప్రకటన చేయాలని... అప్పుడు తన పూర్తి కార్యాచరణను ప్రకటిస్తానని పవన్ అన్నారు. అస్పష్టతతో ఇలాగే కాలయాపన చేస్తే సరైన సమాధానం చెబుతానని తెలిపారు. ప్రజలందరికీ తాను ఒకటే చెబుతున్నానని... అమరావతి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని... ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతిని జగన్ ఒప్పుకున్నారని అన్నారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగేంత వరకు జనసేన అండగా ఉంటుందని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ ఇలాంటి పనులు చేస్తోందని మండిపడ్డారు.