South Africa-Johannesberg Airport: బాలుడి టీ షర్ట్ పై కింగ్ కోబ్రా బొమ్మ.. విమానంలోకి అనుమతి నిరాకరణ!
- జోహెన్నెస్ బర్గ్ విమానాశ్రయంలో ఘటన
- బొమ్మ భయపెట్టే రీతిలో ఉందన్న సిబ్బంది
- బాలుడికి ఇంకో షర్ట్ తొడగడంతో అనుమతి
దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ విమానాశ్రయంలో ఓ కుటుంబానికి విచిత్ర అనుభవం ఎదురైంది. తమ పదేళ్ల కుమారుడు స్టీవ్ లుకాస్ తో కలిసి ఓ జంట న్యూజిలాండ్ వెళ్లే క్రమంలో జోహెన్నెస్ బర్గ్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానాశ్రయంలో సిబ్బంది స్టీవ్ లుకాస్ వేసుకున్న టీ షర్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అది తీసేసి వేరే టీ షర్ట్ వేసుకుంటేనే విమానంలోకి ఎక్కనిస్తామని చెప్పారు.
టీ షర్ట్ పై కింగ్ కోబ్రా బొమ్మ ముద్రితమై ఉండటమే అందుకు కారణం. అది తోటి ప్రయాణికులను భయపెట్టే రీతిలో ఉందని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ జంట సిబ్బందితో వాగ్వాదానికి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి ఆ జంట తమ కుమారుడు స్టీవ్ కు వేసిన టీ షర్ట్ మార్చక తప్పలేదు. ఆ కుర్రాడికి ఇంకో టీ షర్ట్ తొడగటంతో సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించారు.