MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు ఊరట!
- ఎంఎంటీఎస్ రైలు టికెట్లు పెంచని కేంద్రం
- ఆర్టీసీ తర్వాత ఎక్కువ మంది ఆశ్రయించేది ఎంఎంటీఎస్ సేవలనే
- హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ ప్రయాణికులకు ఇది శుభవార్తే. రైలు టికెట్లు పెంచిన కేంద్రం ఎంఎంటీఎస్ (సబర్బన్), ప్యాసింజర్ సీజన్ టికెట్ల జోలికి వెళ్లలేదు. దీంతో నగరంలో ఎంఎంటీఎస్లలో ప్రయాణించే వేలాది మందికి ఊరట లభించినట్టు అయింది. నగరంలో ఎక్కువమంది ఉపయోగించే ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత ఎంఎంటీఎస్‌దే కీలక స్థానం. అలాంటి ఎంఎంటీఎస్ రైలు చార్జీలను కేంద్రం పెంచకపోవడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రైలు చార్జీలను స్వల్పంగా పెంచిన కేంద్రం.. నేటి నుంచి అవి అమల్లోకి రానున్నట్టు నిన్ననే ప్రకటించింది. ప్యాసింజర్ (ఆర్డినరీ) సెకండ్, స్లీపర్, ఫస్ట్‌క్లాస్ చార్జీలు కిలోమీటరుకు పైసా చొప్పున పెరగ్గా, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సెకండ్ క్లాస్, స్లీపర్, ఫస్ట్‌క్లాస్‌లకు కిలో మీటరుకు 2 పైసల చొప్పున, ఏసీ చైర్ కార్, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్‌లలో కిలోమీటరుకు నాలుగు పైసల చొప్పున చార్జీలు పెరిగాయి.