DC: డెక్కన్ క్రానికల్ కు షాక్... చైర్మన్ వెంకట్రామ్ రెడ్డిపై సెబీ నిషేధం!
- ఎండీ, వైస్ చైర్మన్ పైనా నిషేధం
- రెండేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ కు దూరం
- తప్పుడు పత్రాలు చూపించినట్టు ఆరోపణలు
ప్రముఖ దక్షిణాది ఆంగ్ల దినపత్రిక డెక్కన్ క్రానికల్ చైర్మన్ టి. వెంకట్రామ్ రెడ్డి సహా, వైస్ చైర్మన్ వినాయక్ రవి రెడ్డి, పరశురామన్ కార్తీక్ అయ్యర్, ఎండీ ఎన్ కృష్ణలపై సెబీ కొరడా ఝళిపించింది. వీరంతా రెండు సంవత్సరాల పాటు సెక్యూరిటీస్ మార్కెట్ లో ఎటువంటి లావాదేవీలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది.
తప్పుడు పత్రాలను చూపించి, బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయల రుణాలు పొందారన్న ఆరోపణలపై డెక్కన్ క్రానికల్ యాజమాన్యంపై సీబీఐ గతంలోనే కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆగస్టులో కంపెనీపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసి, రూ. 217 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇటీవల సంస్థ బెంగళూరు, కేరళలోని డీసీ ఎడిషన్లను మూసివేసింది.
ఇదిలావుండగా, డీసీతో పాటు సీబీ మౌలీ అండ్ అసోసియేట్స్ భాగస్వామి మణి ఊమెన్ పై ఏడాది పాటు సెబీ నిషేధం విధించింది. ఏ లిస్టెడ్ కంపెనీకి సెక్రటేరియల్ సేవలను అందించరాదని ఆదేశించింది. సంస్థ వద్ద తగినన్ని డబ్బులు లేకుండానే బై బ్యాక్ ఆఫర్ ను సంస్థ ప్రకటించినట్టు ఆరోపణలు రాగా, విచారించిన సెబీ, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.