Kurnool District: మేము ఆంధ్రాలో ఉండలేం... కర్ణాటకలో కలిపేయండి: మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జి తిక్కారెడ్డి
- రాజధాని వివాదంతో ప్రజల్లో అయోమయం
- విశాఖకు వెళ్లాలంటే మాకు 22 గంటలు పడుతుంది
- దానికి బదులు బెంగళూరు మంచిది
రాజధాని విశాఖ అయితే అక్కడికి వెళ్లే కంటే కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లడం మాకు సులభమని, మా నియోజకవర్గాన్ని ఆ రాష్ట్రంలో కలిపేయాలని కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి తిక్కారెడ్డి డిమాండ్ చేశారు. 1956 వరకు కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గం కర్ణాటకలోనే ఉండేదని, తమ ప్రాంతం బళ్లారి జిల్లా ఆదోని తాలూకాలో భాగంగా కొనసాగిందని గుర్తు చేశారు. భాషాపరంగా తెలుగు రాష్ట్రంలో విలీనానికి అప్పుడు సహకరించామన్నారు.
ఇప్పుడు రాజధాని విశాఖకు తరలితే ఏ పనికైనా వెళ్లాలంటే 22 గంటల సమయం పడుతుందని, దానికంటే బెంగళూరు ఏడు గంటల్లో వెళ్లిపోవచ్చన్నారు. పైగా తమ ప్రాంతంలో ఇప్పటికీ కర్ణాటక సంప్రదాయాన్నే ప్రజలు పాటిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో కలిపి ఉద్యమాలు చేస్తామన్నారు.
పాలన చేతకాక రాజధాని పేరుతో ప్రాంతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని, పూర్తి మెజార్టీ ఇచ్చినందుకు ఆయన చేసిన నిర్వాకం ఇదన్నారు. టీడీపీ హయాంలో పూర్తయిన ఆర్డీఎస్ కుడికాల్వ, వేదవతి టెండర్లు జగన్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.