Kerala: కేరళ జిహాదీ గ్రూపులకు ఈ దేశాల నుంచి నిధులు అందుతున్నాయి: ఇంటెలిజెన్స్
- దుబాయ్, టర్కీ దేశాలకు అందుతున్న నిధులు
- స్పందించిన కేంద్ర హోం శాఖ
- పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
కేరళ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని జిహాదీ గ్రూపులకు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని ఇంటెలిజెన్స్ తెలిపింది. దుబాయ్, టర్కీ దేశాల నుంచి ఈ నిధులు వస్తున్నాయని వెల్లడించింది. ఒక జిహాదీ గ్రూపుకు చెందిన ఓ వ్యక్తి గత సెప్టెంబర్ నెలలో 9వ తేదీ నుంచి 19 తేదీ మధ్యలో దుబాయ్ వెళ్లాడని, అక్కడ అతనికి రూ 40 లక్షలు ఆఫర్ చేశారని తెలిపింది.
అక్టోబర్ 1న ఇతర గ్రూపులకు చెందిన ముష్కరులు టర్కీ, ఖతార్ దేశాలకు చెందిన కొందరిని కలిశారని... ఆ సందర్భంగా కావాల్సినన్ని నిధులను అందిస్తామనే హామీని వారు ఇచ్చారని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ స్పందించింది. విదేశాల నుంచి దేశంలోని జిహాదీ గ్రూపులకు అందుతున్న నిధులకు సంబంధించి పూర్తి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. ఏయే దేశాల నుంచి, ఎవరెవరి నుంచి, ఇక్కడ ఎవరెవరికి, ఎంతెంత మొత్తం అందిందో వివరాలను ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.