Narendra Modi: ఈ వ్యవస్థ భారత మిలిటరీని ఆధునికీకరిస్తుంది: మోదీ
- నూతన దశాబ్దం సందర్భంగా సీడీఎస్ రావడం సంతోషంగా ఉంది
- మన మిలిటరీ మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడుతుంది
- 130 కోట్ల ప్రజల ఆకాంక్షలను ఈ వ్యవస్థ నెరవేర్చుతుంది
నూతన సంవత్సరం, నూతన దశాబ్దం ప్రారంభం సందర్భంగా మన దేశానికి తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) రావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. సీడీఎస్ గా బాధ్యతలను స్వీకరించిన బిపిన్ రావత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశం కోసం ఆయన ఎంతో సేవ చేశారని కొనియాడారు. తొలి సీడీఎస్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా దేశం కోసం ప్రాణాలను అర్పించిన వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని చెప్పారు.
2019 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ, దేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రాబోతున్నారని తాను ప్రకటించానని మోదీ గుర్తు చేశారు. మన మిలిటరీ బలగాలు మరింత బలోపేతం కావడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందని చెప్పారు. త్రివిధ బలగాలు మరింత ఆధునికీకరించబడతాయని అన్నారు. 130 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఈ వ్యవస్థ పని చేస్తుందని చెప్పారు. అత్యున్నతమైన నిపుణులతో మిలిటరీ అఫైర్స్ డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేయడం ఒక గొప్ప సంస్కరణ అని చెప్పారు. ఆధునిక యుద్ధాలకు సంబంధించి మిలిటరీ రూపురేఖలను ఈ వ్యవస్థ సమూలంగా మార్చి వేస్తుందని తెలిపారు.