Chandrayaan-3: చంద్రయాన్-3 పనులు ప్రారంభమయ్యాయి... గగన్ యాన్ కోసం ఐఏఎఫ్ నుంచి వ్యోమగాములను ఎంపిక చేశాం: ఇస్రో ఛైర్మన్ శివన్
- చంద్రయాన్-3కి రూ. 250 కోట్లు ఖర్చవుతుంది
- గగన్ యాన్ కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేశాం
- తూత్తుకుడి కోసం రెండో స్పేస్ పోర్టును నెలకొల్పుతున్నాం
చంద్రయాన్-3 మిషన్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని... ఈ ప్రాజెక్టుపై తమ శాస్త్రవేత్తలు పనులు ప్రారంభించారని ఇస్రో ఛైర్మన్ శివన్ వెల్లడించారు. ఈ మిషన్ కు దాదాపు రూ. 250 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రయాన్-2 ద్వారా ఇస్రో మంచి ఫలితాలను సాధించిందని తెలిపారు. చంద్రుడిపై దిగడంలో ల్యాండర్ చివరి క్షణంలో విఫలమైనప్పటికీ... ఆర్బిటర్ మాత్రం అద్భుతంగా పని చేస్తోందని చెప్పారు. మరో ఏడేళ్ల పాటు అది పని చేస్తుందని, సైంటిఫిక్ డేటాను పంపిస్తుందని తెలిపారు.
చంద్రుడిని ఢీకొన్న ల్యాండర్ ను గుర్తించిన భారతీయ వ్యక్తికి శుభాకాంక్షలు చెబుతున్నానని శివన్ అన్నారు. కొన్ని వ్యూహాత్మక కారణాల నేపథ్యంలో, ఈ అంశంపై ఎక్కువగా మాట్లాడలేనని చెప్పారు. చంద్రయాన్-2 సందర్భంగా ల్యాండర్ విఫలం కావడంతో తాను మానసికంగా చాలా కదిలిపోయానని... ప్రధాని మోదీ తనను హత్తుకోవడం ఊరట కలిగించిందని తెలిపారు.
గగన్ యాన్ మిషన్ విషయంలో కూడా మంచి పురోగతి ఉందని శివన్ చెప్పారు. ఈ మిషన్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక పూర్తయిందని... ఈ నెల మూడో వారం నుంచి వారికి ట్రైనింగ్ మొదలవుతుందని తెలిపారు. ఈ నలుగురు వ్యోమగాములు పురుషులని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందినవారని వెల్లడించారు. వీరికి రష్యాలో శిక్షణ ఉంటుందని చెప్పారు. తమిళనాడులోని తూత్తుకుడిలో రెండో స్పేస్ పోర్టును నెలకొల్పబోతున్నామని... దీనికి సంబంధించి భూసేకరణ కార్యక్రమం కొనసాగుతోందని శివన్ తెలిపారు.