Currency: నోట్లను గుర్తించే యాప్ ను విడుదల చేసిన ఆర్బీఐ
- కంటి చూపు సరిగాలేని వారికి సౌలభ్యం
- ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు
- నోట్లను స్కాన్ చేసి హిందీ, ఇంగ్లీష్ లో వివరాల వెల్లడి
కరెన్సీ నోట్లను గుర్తించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త అప్లికేషన్ ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా కంటి చూపు సరిగాలేని వారు సైతం కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేతులమీదుగా ‘ఎంఏఎన్ఐ’(మనీ) పేరుతో మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు యాప్ వివరాలను వెల్లడించారు.
కంటిచూపు సరిగాలేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా ఈ యాప్ ను తయారు చేశామన్నారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. దీనిని ఒకసారి ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆ తర్వాత అది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఫోన్ లోని కెమెరాను ఉపయోగించుకుంటూ ఈ యాప్ కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఆంగ్లంలో సమాధానమిస్తుందన్నారు.