Trai: రూ. 130కి 200 చానెళ్లు... టీవీ ప్రేక్షకులకు ట్రాయ్ నూతన సంవత్సరం కానుక!
- కొత్త టారిఫ్ లపై వినియోగదారుల్లో అసంతృప్తి
- నిబంధనలను సవరించిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ
- చానెల్ గరిష్ఠ ధర రూ. 19 నుంచి రూ. 12కు తగ్గింపు
- రెండో కనెక్షన్ కు 40 శాతం తక్కువ ధర
కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) కానుక ఇచ్చింది. రూ. 160 చెల్లించే వినియోగదారులందరికీ, ఉచితంగా వచ్చే చానెళ్లను ఇవ్వాల్సిందేనని, అదనంగా 26 దూరదర్శన్ చానెళ్లను అందించాలని తెలిపింది. చానెళ్ల గరిష్ఠ ధర ప్రస్తుతం రూ. 19 ఉండగా, దాన్ని రూ. 12కు తగ్గించింది. ఒకటికి మించి ఒకే ఇంట్లో టీవీలుంటే కనుక, రెండో కనెక్షన్ కు 40 శాతం తక్కువ ధరను వసూలు చేయాలని పేర్కొంది.
ఇదే సమయంలో 20 శాతానికిపైగా వీక్షకులుండే చానెళ్లకు క్యారియర్ ఫీజును వసూలు చేయవద్దని పేర్కొంది. ప్రస్తుతం గరిష్ఠ క్యారియర్ ఫీజు రూ. 4 లక్షలుగా ఉండగా, దాన్ని తగ్గిస్తున్నట్టు పేర్కొంది. కొత్త నిబంధనలు మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక ఒక భాషకు చెందిన చానెళ్లన్నీ ఒకే వరసలో ఉండాలని, చానెల్ నంబర్ ను తరుచూ మార్చవద్దని, ఒకవేళ మార్చాలంటే ముందుగా ట్రాయ్ అనుమతి తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది.
కాగా, తాము చూసే చానెళ్లకే డబ్బు చెల్లించే విధంగా గతంలో తయారు చేసిన విధానం, రూపొందించిన నిబంధనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ట్రాయ్ కొత్త ఆదేశాలు విడుదల చేసింది. ప్రస్తుతం దూరదర్శన్ చానెళ్లు కాకుండా కేవలం 100 ఉచిత చానెళ్లను మాత్రమే ప్రసారం చేస్తూ, ఆపై ప్రతి 25 ఉచిత చానెళ్లకు రూ. 20ని అదనంగా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.
మారిన నిబంధనల ప్రకారం, నెలకు రూ. 160 చెల్లించే వారందరికీ తమవద్ద ఉన్న ఉచిత చానెళ్లను తప్పనిసరిగా సర్వీస్ ప్రొవైడర్లు ఇవ్వాల్సిందే. ఇక అలాకార్టే పేరుతో విడివిడిగా చానెళ్లను ఎంచుకుంటే మరింతగా వసూలు చేసే వీలుండదు. అలాకార్టేలో విడివిడిగా ఇచ్చే చానళ్ల ధర బొకే ధరకు ఒకటిన్నర రెట్లకు మించి ఉండరాదని ట్రాయ్ కొత్త నిబంధన విధించింది. దీంతో విడివిడిగా తీసుకుంటే, రూ. 60 వరకూ పడే ధర, బొకేగా కొనుగోలు చేస్తే, రూ. 30కే ఇస్తున్న కంపెనీల ఆటకు అడ్డుకట్ట పడనుంది. అలాకార్టేలో ఉండే చానెల్ సగటు ధర, ఆ చానెల్ లోని సగటు ధరకు 3 రెట్లకు మించి ఉండకూడదన్న కొత్త నిబంధన అమలులోకి వచ్చింది.
ఇక కొత్త విధానం ప్రకారం సవరించిన అలా కార్టె చానల్, బొకేల ధరలను జనవరి 15లోగా ప్రజల ముందుంచాలి. బ్రాడ్ కాస్టర్లు, ఈ నెలాఖరులోగా ఆపరేటర్లు విధిగా తమతమ వెబ్ సైట్లలో ఈ వివరాలను తెలియజేయాల్సి వుంటుంది. ఆపై కస్టమర్లు, తాము ఎంచుకునే చానెళ్లకు మాత్రమే డబ్బులు కట్టుకుని చూసే వెసులుబాటు లభిస్తుంది.