YS Viveka: సీబీఐతో దర్యాపు చేయించాలంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ!
- ఏపీ హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
- వివేకా హత్య కేసులో ఆదిపై ఆరోపణలు
- సిట్ నుంచి కేసును సీబీఐకి బదలాయించాలని డిమాండ్
దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించి, నిజానిజాల నిగ్గు తేల్చాలని, ఏపీ మాజీ మంత్రి, కడప జిల్లా బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా, అది నేడు విచారణకు రానుంది.
ఈ హత్య కేసులో ఆదినారాయణరెడ్డిపైనా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన్ను సిట్ అధికారులు పిలిపించి విచారణ జరిపారు కూడా. ఈ నేపథ్యంలో కేసును సిట్ నుంచి సీబీఐకి బదలాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, తనకు ప్రమేయముందని రుజువైతే, ఏ శిక్షకైనా సిద్ధమేనని గతంలో ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి, ఆపై తెలుగుదేశం పార్టీలో చేరి, మంత్రిగానూ ప్రజలకు సేవలందించారు. ఇటీవల ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.