prakash javadekar: ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి జవదేకర్ విమర్శలు
- సీఏఏ ఆందోళనల వెనక కాంగ్రెస్, ఆప్ హస్తం
- ఢిల్లీ అభివృద్ధిని ఆప్ ప్రభుత్వం నాశనం చేస్తోంది
- మేం పనులు చేస్తే.. వారు చెప్పుకుంటున్నారు
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ (ఆప్) తోపాటు కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల వైఖరి చూస్తుంటే పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను వారే ప్రోత్సహించినట్టు కనిపిస్తోందన్నారు. ఢిల్లీలోని జామియా నగర్, సీలంపూర్, జామా మసీద్ ప్రాంతాలలో జరిగిన హింసాత్మక ఘటనల వెనక వారి హస్తం ఉన్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇతర దేశాల నుంచి వచ్చే మైనారిటీ శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న మునిసిపల్ కార్పొరేషన్లను ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్, ఆప్ పార్టీల తీరును ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఢిల్లీని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వాటిని తామే చేశామంటూ ఆప్ నేతలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జామియానగర్లో ఆప్ నేత అమానతుల్లా ఖాన్, కాంగ్రెస్ నేత అసిబ్ఖాన్లు వివాదాస్పద ప్రసంగాలు చేశారని ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు.