East Godavari District: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు ప్రారంభమైన ఏర్పాట్లు
- పలు ప్రాంతాల్లో పొలాల చదును మొదలు
- పందాలను అడ్డుకుంటామంటున్న పోలీసులు
- ఆన్ లైన్ మాధ్యమంగా జోరుగా కోళ్ల అమ్మకాలు
సంక్రాంతి పండగ దగ్గరికొచ్చింది. మరో పది రోజుల్లో వేడుకలు ప్రారంభమవుతాయి. సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలే. కోడి పందాలు వద్దని, జీవ హింస తగదని కోర్టులు ఎంతగా వారిస్తున్నా, ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంచేందుకు పోలీసులు, ప్రభుత్వ అధికారులు ప్రయత్నిస్తున్నా, పందెం రాయుళ్లు మాత్రం ఆగడం లేదు.
ఈ క్రమంలో ఈ సంవత్సరం కూడా కోడి పందాలను వైభవంగా నిర్వహించుకునేందుకు అప్పుడే ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. భీమవరం, ఏలూరు, అమలాపురం, కాకినాడ, కైకలూరు, వెంప తదితర ప్రాంతాల్లో పొలాలను చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సంవత్సరం ఆన్ లైన్ లో కోళ్లను అమ్మకానికి ఉంచిన పెంపకందారులు, కోడి పుట్టిన నక్షత్రం, వారం, తేదీలను కూడా ప్రస్తావిస్తుండడం గమనార్హం. కోడి రకాన్ని బట్టి దాని రేటు రూ. 10 వేల నుంచి రూ. 35 వేల వరకూ పలుకుతోంది. ధర అధికమైనా నచ్చిన కోడి కనిపిస్తే, ఆన్ లైన్ లోనే లావాదేవీలు జరుపుతూ, వాటిని పందెం రాయుళ్లు సొంతం చేసుకుంటున్నారు.
మరోపక్క, కోడి పందాలు నిర్వహిస్తే, కేసులు పెడతామని, పందెం రాయుళ్లపై చట్టపరమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా, భోగి నాటికి పరిస్థితులు సర్దుకుంటాయని, సంప్రదాయ పందాలను నిర్వహించి తీరుతామని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.