Andhra Pradesh: ఆశించిన రీతిలో ఏసీబీ పనితీరు లేదంటూ సీఎం జగన్ అసంతృప్తి
- ఏసీబీపై సమీక్షా సమావేశం నిర్వహణ
- సిబ్బందికి అలసత్వం ఉండకూడదు
- అంకిత భావంతో పనిచేయాలి
ఆశించిన రీతిలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పని తీరు లేకపోవడంతో ఏపీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏసీబీపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ కుమార్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని, మరింత చురుగ్గా, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు.
ప్రజలు ఎవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని, ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా లంచాలు చెల్లించే పరిస్థితి ఉండకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. సెలవులు లేకుండా పనిచేయాలని, మూడు నెలల్లోగా మార్పు కనిపించాలని, కావాల్సినంత మంది సిబ్బందిని తీసుకోవాలని ఆదేశించారు. ఏసీబీకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరో నెల రోజుల్లో సమీక్షిస్తామని, ఆలోగా మార్పు కనిపించాలని అన్నారు.