YS Viveka: వివేకా హత్య కేసులో హరిత హోటల్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించిన సిట్ అధికారులు
- పరమేశ్వర్ రెడ్డి చుట్టూ బిగుస్తున్న సిట్ ఉచ్చు
- హత్య జరిగిన తర్వాత పరమేశ్వర్ కదలికలపై సిట్ ఆరా
- కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి కూడా వివరాల సేకరణ
ఎన్నికలకు ముందు పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. హంతకులెవరన్నది ఇప్పటికీ తెలియరాలేదు. అయితే ఈ కేసు విచారణను చేపట్టిన సిట్ అధికారులు తాజాగా తమ దర్యాప్తులో వేగం పెంచారు. ఈ క్రమంలో, కడప పట్టణంలోని హోటల్ హరిత సిబ్బందిని విచారించారు. పులివెందుల డీఎస్పీ వాసుదేవన్ నేతృత్వంలోని సిట్ బృందం హోటల్ మేనేజర్ ను విచారించారు. దాదాపు రెండు గంటలకు పైగా అక్కడి సిబ్బందిని విచారించారు. అంతేకాకుండా, హత్య జరిగిన నాటి హోటల్ రికార్డులను, హోటల్ సిబ్బంది చెప్పిన సమాధానాలను విశ్లేషించారు.
కాగా, ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి కూడా వివేకా కేసుకు సంబంధించిన వివరాలు సేకరించారు. తాజాగా జరిగిన ఈ దర్యాప్తు యావత్తు ఈ కేసులో అనుమానితుడుగా ఉన్న కొమ్మా పరమేశ్వర్ రెడ్డి కదలికలపైనే సాగింది. వివేకా హత్య జరిగిన తర్వాత పరమేశ్వర్ రెడ్డి ఆరోగ్యం బాగాలేదని కడప సన్ రైజ్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స తర్వాత హోటల్ హరితలో బస చేసి ఓ టీడీపీ నేతను కలిసినట్టు భావిస్తున్నారు. ఆ సమయంలో పరమేశ్వర్ రెడ్డి, టీడీపీ నేతకు మధ్య జరిగిన సంభాషణ ఏంటన్న దానిపైనే సిట్ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.