YSRCP: కామెంట్ కాదు నేరుగా చర్చకే నేను సిద్ధం..మీరే ఫిక్స్ చెయ్యండి: విజయసాయికి బుద్ధా ప్రతిసవాల్
- అమరావతిపై ఆరోపణలకు ఇప్పటికే సమాధానం ఇచ్చాం
- మీరు ఛాలెంజ్ విసిరారుగా.. మీ ప్రశ్నలకు సమాధానాలిస్తా
- సమయం, ప్రదేశం చెప్పండి?
ఏపీ రాజధాని అమరావతికి గత ప్రభుత్వం చేసింది శూన్యం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఘాటుగా ప్రతి స్పందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. అమరావతి విషయంలో విజయసాయిరెడ్డి చేసిన అనేక ఆరోపణలకు చాలాసార్లు సమాధానం ఇచ్చామని, అయినా మీరు ఛాలెంజ్ విసిరారు కనుక, అమరావతిలో ఈ అంశాలపై ‘నేను మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తా. మీరు ఎప్పుడు వస్తారో తెలపండి?’ అని ప్రతిసవాల్ విసిరారు. కామెంట్ చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించిన విజయసాయిరెడ్డికి ఆయన సవాల్ చేశారు.
‘కామెంట్ కాదు నేరుగా చర్చకే నేను సిద్ధంగా ఉన్నా. సమయం, ప్రదేశం మీరే ఫిక్స్ చెయ్యండి’ అని ఛాలెంజ్ విసిరారు. ‘విత్తనాలు ఇవ్వలేని వాడు, ఇంటి ముందు రత్నాలు పోస్తా అన్నాడట’ వైఎస్ జగన్ లాంటి వ్యక్తి అని, ‘మీ మహామేత హయాంలో 14,565 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు జగన్ గారు ఇచ్చిన హామీ 7 లక్షల సాయం ఎప్పుడు అందిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
చంద్రబాబు హయాంలో 1513 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఆరోపించారు, మరి, వైసీపీ ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 391 మంది మాత్రమే ఆత్మహత్యలు చేసుకున్నారని, వారికి అప్పటి ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందించింది అని చెప్పారేంటి? అని ప్రశ్నించారు. జగన్ ఆరు నెలల పాలనలో 254 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారిలో ఎంతమంది కుటుంబాలకు సాయం అందించారో చెప్పగలరా? అని ప్రశ్నించారు.