Andhra Pradesh: ఏపీ విద్యాశాఖ అధికారుల తీరు దారుణంగా ఉంది: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే
- గతేడాది మేలో ఇండెంట్ పెడితే ఇప్పుడా ఇచ్చేది
- అధికారులు నిద్రపోతున్నారు
- విద్యార్థులు ఏం చదివి పరీక్షలు రాస్తారు?
ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖ పనితీరుపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చిలో విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనుండగా, ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు పంపిణీ కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులు ఏం చదివి పరీక్షలు రాస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. చూస్తుంటే విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నట్టు ఉందన్నారు. లేకపోతే, 2019లో ఇవ్వాల్సిన పుస్తకాలు ఇప్పుడు వచ్చినా ఎందుకు పంపిణీ చేయలేదని నిలదీశారు. డీఈవోను అడిగితే ప్రభుత్వం నుంచి పుస్తకాలు రాలేదని చెప్పారని తెలిపారు.
గతేడాది మేలో ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు కావాలని ఇండెంట్ పెడితే జనవరిలో ఇవ్వడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అంతటా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉందన్నారు. కనీసం వచ్చే ఏడాది అయినా సకాలంలో పుస్తకాలు అందించాలని అధికారులను ఆర్కే కోరారు.