MAA: నా వల్ల జరిగిన దానికి క్షమించండి.. చిరంజీవికి, నాకు మధ్య గొడవలు లేవు: రాజశేఖర్
- దయచేసి గొడవను పెద్దది చేయొద్దు
- ‘మా’కు చిరంజీవి, మోహన్‌బాబు సేవలు అవసరం
- ఏ ఒక్క పనీ సరిగా జరగకపోవడం వల్లే స్పందించాల్సి వచ్చింది
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన గొడవ అనంతరం ‘మా’ కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నటుడు రాజశేఖర్.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. గురువారం నాటి గొడవను పెద్దదిగా చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తనకు, చిరంజీవికి, మోహన్‌బాబుకి మధ్య ఎలాంటి గొడవలు కానీ, అపోహలు కానీ లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తన వల్ల జరిగిన గొడవకు క్షమాపణలు వేడుకుంటున్నట్టు రాజశేఖర్ తెలిపారు.
తన పదవికి రాజీనామా చేశానని, పరిశ్రమకు తన వంతు సాయం ఏది అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిరంజీవి, మోహన్‌బాబుపై తనకు అమితమైన గౌరవం ఉందని, ‘మా’కు వారి సేవలు అవసరమని అన్నారు. గొడవను తమ ముగ్గురి మధ్య జరిగిన గొడవగా చూడొద్దని కోరారు. గురువారం ఏం జరిగినా అది తనకు, నరేశ్‌కు, ‘మా’కు మధ్య మాత్రమే జరిగినదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పేర్కొన్నారు. ఏ ఒక్క పనీ సరిగా జరగకపోవడం వల్ల తాను మాట్లాడకుండా ఉండలేకపోయానని రాజశేఖర్ స్పష్టం చేశారు.