Iran: బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి.. రెండు దేశాల ఉన్నతస్థాయి కమాండర్లు సహా 8 మంది మృతి
- రెండు రోజుల క్రితం అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతుదారుల దాడి
- ఇరాక్ చేరుకున్న అమెరికా అదనపు బలగాలు
- మృతుల్లో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసిం సొలీమని
ఇరాక్ రాజధాని బాగ్దాద్ విమానాశ్రయంపై ఈ తెల్లవారుజామున జరిగిన రాకెట్ దాడిలో ఇరాన్, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాక్ మీడియా పేర్కొంది. విమానాశ్రయ కార్గోహాల్‌ను మొత్తం మూడు రాకెట్లు ఢీకొట్టాయి. ఈ దాడిలో రెండు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇరాన్ నిఘా విభాగాధిపతి ఖాసిం సొలీమని ఉన్నట్టు ఇరాక్ మీడియా తెలిపింది. దాడి ఎవరు చేశారన్న దానిపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు.
ఇరాన్ మద్దతుదారులు కొందరు రెండు రోజుల క్రితం ఇరాక్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై దాడిచేయడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిని తీవ్రంగా పరిగణించిన అమెరికా ఇరాక్‌కు అదనపు బలగాలను పంపించింది. ఆ వెంటనే ఈ దాడి జరగడం గమనార్హం.