Transtroy: గతంలో కోట్ల కొద్దీ విరాళాలు ఇచ్చిన ట్రాన్స్ ట్రాయ్ ఎండీ చెరుకూరి శ్రీధర్... ఇప్పుడు ఆరా తీస్తున్న సీబీఐ
- 2012లో పద్మావతి అమ్మవారికి రూ. 4.33 కోట్ల బంగారు చీర
- 2013లో తిరుమల నిత్యాన్నదానానికి రూ. 3.42 కోట్ల విరాళం
- సంస్థ ఆదాయం, పన్ను వివరాలు పరిశీలిస్తున్న సీబీఐ
చెరుకూరి శ్రీధర్... ట్రాన్స్ ట్రాయ్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్. దేవాలయాలకు భూరి విరాళాలు ఇచ్చిన పేరుంది. ఇప్పుడు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై సీబీఐ సోదాలు జరుగుతున్న వేళ, నాటి విరాళాలకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు.
2012 నవంబర్ 17న తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి రూ. 4.33 కోట్ల విలువైన బంగారు చీరను శ్రీధర్ కానుకగా ఇచ్చారు. అప్పట్లో దీని గురించి పెద్ద ప్రచారమే జరిగింది. చీర తయారీకి 8 కిలోల బంగారాన్ని, వజ్రాలను, పగడాలను వినియోగించారు. ఆపై 2013 డిసెంబర్ లో తిరుమలకు వచ్చిన ఆయన, నిత్యాన్నదానం ట్రస్ట్ కు రూ. 3.42 కోట్లు విరాళమిచ్చారు. ఆ విషయాన్ని తెలుసుకున్న సీబీఐ అధికారులు, 2013కు ముందు సంస్థ ఆదాయం, కట్టిన పన్ను, బ్యాలెన్స్ షీట్లను, ఐటీ రిటర్న్ లను పరిశీలించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.