Ranga Reddy District: ఆస్తి కోసం కన్నతండ్రికి ఉరివేసి, పురుగుల మందు తాగించి దారుణ హత్య
- తోడల్లుడు, మామతో కలిసి తండ్రి హత్య
- తండ్రి బతికి ఉంటే ఆస్తి దక్కదని భావించిన కొడుకు
- పోలీసుల విచారణలో తండ్రిని తానే హత్య చేసినట్టు అంగీకారం
ఆస్తి కోసం కన్నతండ్రిని దారుణంగా హత్య చేశాడో కొడుకు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్నెపల్లికి చెందిన బొమ్మిడి బుచ్చిరెడ్డి (55)కి విక్రంరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి ఇద్దరు కుమారులు. బుచ్చిరెడ్డి తండ్రి చిన్న నారాయణ కొన్నేళ్ల క్రితం గ్రామానికి చెందిన కొందరికి మూడెకరాలను దానంగా ఇచ్చేశాడు. ఇప్పుడా భూమి ధర లక్షల్లో పలుకుతోంది. దీంతో ఆ భూమిపై కన్నేసిన బుచ్చిరెడ్డి కుమారులు అది తమదేనంటూ కోర్టును ఆశ్రయించారు. మరోవైపు కుటుంబ తగాదాల కారణంగా తండ్రిని పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలో భూమి సాగు చేసుకుంటున్న వారి నుంచి తన తండ్రి డబ్బులు తీసుకుని రాజీకి ప్రయత్నిస్తున్నట్టు కుమారుడు విక్రంరెడ్డి అనుమానించాడు. ఆయన బతికి ఉంటే ఆస్తి తమకు దక్కదని భావించి హత్యకు పథకం రచించాడు.
తన తోడల్లుడు దామోదర్‌రెడ్డి, మామ నారాయణరెడ్డిని కలిసి విషయం చెప్పి సాయం కోరాడు. గత నెల 27న వికారాబాద్ వచ్చిన బుచ్చిరెడ్డిని మద్యం తాగుదామంటూ దామోదర్‌రెడ్డి, నారాయణరెడ్డి పొలం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగి మత్తులోకి జారుకున్న తర్వాత అప్పటికే అక్కడ కాపు కాసిన విక్రంరెడ్డి తండ్రి మెడకు తువ్వాలు చుట్టి పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం నవీన్‌రెడ్డి అనే వ్యక్తి సాయంతో మృతదేహాన్ని ఎన్కెపల్లిలోని పొలంలో పడేసి ఇంటికి వెళ్లిపోయాడు.
తర్వాతి రోజు విషయం వెలుగులోకి రావడంతో ఎవరో హత్య చేసి పడేసి ఉంటారని ఏమీ తెలియనట్టు విక్రంరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానించిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విక్రంరెడ్డితో పాటు అతడికి సహకరించిన ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు.