Tirumala: తిరుమలలో రెండు రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: ఈఓ అనిల్ కుమార్
- 6, 7 తేదీల్లో స్వామి దర్శనం
- లక్షా 80 వేల మందికి అవసరమైన ఏర్పాట్లు
- రూ.1.7 కోట్లతో పనులు పూర్తి
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు రెండు రోజులపాటు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈనెల 6, 7 తేదీల్లో ఏకాదశి, ద్వాదశి సందర్భంగా లక్షా ఎనభై వేల మంది భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని లక్షా 70 వేల రూపాయల ఖర్చుతో అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు చెప్పారు. స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు కూడా తమవంతు సహకారం అందించాలని సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
నారాయణగిరి ఉద్యానవనంలో నూతనంగా ఏర్పాటుచేసిన క్యూలైన్ ను ఐదో తేదీ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ నెల 21, 28 తేదీల్లో దివ్యాంగులకు, 22, 29 తేదీల్లో చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేకంగా శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు సింఘాల్ తెలిపారు.
విశాఖలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయాన్ని ఏప్రిల్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.