MAA: చిరంజీవి ముందే ఇంత గోలా?... బాధేసిందన్న శివాజీ రాజా!
- నిన్న హైదరాబాద్ లో 'మా' డైరీ ఆవిష్కరణ
- విమర్శలతో రసాభాసగా మారిన కార్యక్రమం
- ముందే సమస్యలు పరిష్కరించుకుంటే బాగుండేది
- వడ్డించిన విస్తరిని కాలితో తన్నుతున్న అధ్యక్షుడు
- నరేశ్ టార్గెట్ గా శివాజీ రాజా విమర్శలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ 'మా' డైరీ ఆవిష్కరణ సందర్భంగా నిన్న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన రసాభాసపై నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్పందించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, మెగాస్టార్ చిరంజీవి ముందే ఈ విధమైన గోల జరగడం, తనకు చాలా బాధగా అనిపించిందని అన్నారు.
ఇంత జరుగుతుంటే, అధ్యక్షుడు ఏం చేస్తున్నాడని ప్రశ్నించిన శివాజీ రాజా, రాజశేఖర్ మైక్ ను తీసుకోకముందే స్పందించివుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. వేదికపైకి రాకముందే అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే దిశగా చొరవ చూపించి వుంటే ఈ పరిస్థితి ఉత్పన్నం అయ్యుండేది కాదని సీనియర్ నరేశ్ టార్గెట్ గా శివాజీ రాజా వ్యాఖ్యానించారు.
ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే, శిక్షించేందుకు అసోసియేషన్ లో క్రమశిక్షణా కమిటీ ఉందని వ్యాఖ్యానించిన ఆయన, ఆ కమిటీ తన పని తాను చేసుకుకు పోతుందని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరినో టార్గెట్ చేయాలని తాను అనుకోవడం లేదని, ఎవరినీ దూషించాలని కూడా తనకు లేదని, అయితే, ఎవరికి వారు వ్యక్తిగత ఆత్మ విమర్శ చేసుకుని, ఎవరిది తప్పో తేల్చుకోవాలని సూచించారు.
ఎంతో మంది దాతలు అసోసియేషన్ కు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తే, వడ్డించిన విస్తరిని కాలితో తన్నిన వారు కూడా ఉన్నారని శివాజీ రాజా విమర్శనాస్త్రాలు గుప్పించారు. అటువంటి వ్యక్తి, ఇప్పుడు అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరమని అన్నారు.