Telugudesam: రాజధాని తరలింపు మీ తాత, ముత్తాత వల్ల కూడా కాదు: సీఎం జగన్ పై ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు
- తరలింపు మాట మరిచి అమరావతిని అభివృద్ధి చేయాలి
- ఒక్క అవకాశమివ్వాలని అడిగితే.. ప్రజలు నమ్మి ఓట్లేశారు
- 151 మంది ఎమ్మెల్యేలనిచ్చినా.. పాలన చేతకావడం లేదు
అమరావతి నుంచి రాజధాని తరలింపు సీఎం జగన్ వల్లనే కాదు ఆయన తాత, ముత్తాల వల్ల కూడా కాదని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. మూడు రాజధానుల ప్రకటనతో.. రాజధానిని తరలించేందుకు జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కేశినేని స్పందించారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని తరలింపు మీతాత, ముత్తాత వల్ల సాధ్యపడదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజధానిని తరలించే హక్కు ఎవరికీ లేదంటూ.. అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అదీ సాధ్యం కాకపోతే రాజీనామా చేయాలన్నారు.
ఒక్క అవకాశమివ్వాలంటూ.. మాయ మాటలు చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారన్నారు. మళ్లీ ఎన్నికలకు వెళితే వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తరిమి కొడతారని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినా జగన్ కు పాలన చేతకావడంలేదని మండిపడ్డారు.
మీ పార్టీకి 22 మంది ఎంపీలున్నారు.. మా పార్టీకి ముగ్గురు ఎంపీలున్నారంటూ.. వారిని ఎదుర్కోవడానికి తాము చాలు అని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నిర్మాణం చేశాడన్న కారణంతో ప్రజావేదిక కూల్చివేయించాడని నాని ఆరోపించారు. తప్పుచేస్తే ఇక్కడి మహిళలు ఊరుకోరని పేర్కొన్నారు. విశాఖపై జగన్ కు ప్రేమ లేదంటూ.. ఆయనకు ఆదాయ మార్గాలే తప్ప మిగతావి కనిపించవని చెప్పారు.