Chandrababu: ఏ పేరుతో ప్రారంభించి ఏ పేరుతో ముగించాలో అర్థంకాని పరిస్థితి: చంద్రబాబు
- చంద్రబాబు మీడియా సమావేశం
- సీఎం జగన్ పై విమర్శలు
- చరిత్రలో రాజధాని మార్చింది తుగ్లక్ ఒక్కడేనని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని చుట్టూ నెలకొన్న పరిస్థితులపై స్పందించారు. మంగళగిరిలో విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశమయ్యారు. తెలంగాణ వెళితే మా రాజధాని హైదరాబాద్ అని చెప్పుకుంటారని, దేశంలో ఎక్కడికి వెళ్లినా రాజధాని ఏదంటే ఏదో ఒకటే పేరు చెబుతారని, కానీ మన రాష్ట్రంలో మూడు రాజధానులంటున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని ఏదంటే ఏ పేరుతో మొదలుపెట్టి ఏ పేరుతో ముగించాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. అలాగని రాజధాని మార్చే అధికారం సీఎంకు ఉందా? అంటే అదీ లేదని స్పష్టం చేశారు.
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని తెలిపారు. 45 రోజుల్లో రాజధానిని నిర్ణయించుకునేందుకు శివరామకృష్ణ కమిటీ వేశారని, అటు ఆరు జిల్లాలు, ఇటు ఆరు జిల్లాల మధ్యన ఉన్న ఏడో జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. అందరికీ సమానమైన దూరంలో ఏపీ రాజధాని ఉందని చెప్పారు. హైకోర్టు కూడా ఇక్కడే కొలువైందని పేర్కొన్నారు.
"మనం చరిత్ర చూస్తే ఓ ముఖ్యమంత్రి రాజధానులు మార్చే అవకాశమే లేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఎందరో సీఎంలు వచ్చారు కానీ ఎవరూ రాజధాని మార్చుతామని చెప్పలేదు. అప్పుడెప్పుడో తుగ్లక్ మార్చాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు, కొత్త రాష్ట్రాలు విడిపోయినప్పుడే కొత్త రాజధానులు ఏర్పడ్డాయి. కానీ ఈ ముఖ్యమంత్రిది వితండవాదం. రాజధాని మార్పుకోసం కమిటీల మీద కమిటీలు వేశాడు. రాజధాని అంటే ఏదో ఆఫీసులు పెట్టుకోవడానికి కాదు, యువత భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రాంతంగా ఉండాలి. హైదరాబాద్ లాంటి రాజధాని కావాలి. అక్కడ మన శ్రమంతా నష్టపోయాం.
పాచిపనులు చేయడానికి, తాపీ పనులు చేయడానికి, ఇళ్లకు కాపలా కాయడానికి, ఐటీ ఉద్యోగాలకు ఇక్కడినుంచి వెళుతున్నారు. అలాంటి నగరాన్ని మనమెందుకు సృష్టించకూడదన్న ఉద్దేశంతోనే అమరావతికి అంకురార్పణ చేశాం. చరిత్రలో ఎక్కడా లేని విధంగా రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేశారు. ప్రభుత్వం చెప్పిన మాట నమ్మి భూములు ఇచ్చారు.
ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అయినప్పుడు, దేనికి లక్ష కోట్లవుతుంది? ఇప్పటికే రాజధానిలో చాలా డిపార్ట్ మెంట్ల ఆఫీసులు కూడా ఏర్పడ్డాయి. అమరావతికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాన్ని వదిలేసి ఈ సీఎం మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఇదేమన్నా పేకాటా? అభివృద్ధి వికేంద్రీకరణ తెలియదు, అభివృద్ధి చేయడం తెలియదు కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాడంట!" అంటూ ధ్వజమెత్తారు.
అభివృద్ధి జరిగి సంపద సృష్టించినప్పుడే ఎవరికి దక్కాల్సిన ఆదాయం వారికి వస్తుందని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం లభిస్తుందని, అదే సమయంలో వ్యక్తులకూ ఆదాయం దక్కుతుందని అన్నారు. వ్యక్తులు ఖర్చు పెట్టే పరిస్థితులు కల్పించినప్పుడే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు.
పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ఉద్యోగాల కల్పన, వస్తు వినిమయంపై పన్నులు.. ఇలా ఆదాయం సమకూరుతుందని విశ్లేషించారు. ఇది ఆర్థికశాస్త్రంలో ప్రాథమిక సిద్ధాంతం అని చెప్పిన చంద్రబాబు, ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయం తగ్గిపోయిందని, పన్నుల రాబడి క్షీణిస్తోందని, తద్వారా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.