Chandrababu: మేం అభివృద్ధి వికేంద్రీకరణ చేశాం... ఇప్పుడన్నీ పోయాయి: చంద్రబాబు
- మంగళగిరిలో చంద్రబాబు మీడియా సమావేశం
- వికేంద్రీకరణ గురించి చెప్పిన టీడీపీ అధినేత
- కంపెనీలు వెళ్లిపోతున్నాయని ఆవేదన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళగిరిలో విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశమయ్యారు.. రాజధాని అంశంపై నెలకొన్న పరిణామాలను ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ వస్తే ఎంత పికప్ అయ్యిందో, విశాఖపట్నంలో కూడా అదానీ డేటా సెంటర్ వస్తే అంతే అభివృద్ధి జరుగుతుందని భావించామని అన్నారు. అదానీలు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.
ఇవాళ ప్రతిదీ డేటాతోనే సాధ్యమవుతోందని, అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇలా అనేక రకాలుగా డేటాతో అభివృద్ధి సాధించవచ్చని వివరించారు. అందుకే విశాఖను వరల్డ్ డేటా హబ్ గా మార్చాలని భావించామని, తద్వారా ప్రపంచానికే ఒక ఆదర్శనీయమైన నగరంగా మార్చాలనే తాము విశాఖను అభివృద్ధి చేయాలనుకున్నామని తెలిపారు. విశాఖను పర్యాటకంగానూ తీర్చిదిద్దేందుకు లులూ కంపెనీని తీసుకువచ్చామని చెప్పారు.
"హైదరాబాద్ లో హైటెక్ సిటీ, హైటెక్స్, ఓ కన్వెన్షన్ సెంటర్, ఓ హోటల్, ఓ ఎగ్జిబిషన్ సెంటర్ ఉన్నాయి. ఇక్కడ కూడా షాపింగ్ మాల్ సహా అన్నీ ఏర్పాటు చేశాం. విశాఖపట్నంలో నేను నాలుగు సార్లు సీఐఐ సదస్సులు ఏర్పాటు చేస్తే అన్నిసార్లు షెడ్లు వేసి నిర్వహించాల్సి వచ్చింది. సరైన వసతులు లేకపోవడంతో అత్యుత్తమ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు దాన్ని రద్దు చేసే పరిస్థితి వచ్చింది. వారు హైదరాబాద్ తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ వంటి ఫార్చ్యూన్-500 జాబితాలో ఉన్న కంపెనీని తీసుకువస్తే దాన్ని కూడా వెనక్కిపంపారు.
తిరుపతిలో టీసీఎస్ ను తీసుకువచ్చాం, రిలయన్స్ హార్డ్ వేర్ హబ్ తీసుకువచ్చాం. హీరో మోటార్స్, అపోలో టైర్స్, ఇసుజు వంటి కంపెనీలు శ్రీసిటీలో వచ్చాయి. వెనుకబడిన జిల్లా అనంతపురంలో కియా మోటార్స్ ను తీసుకువచ్చాం. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు పోటీకి వచ్చినా కియాను మన రాష్ట్రానికి తీసుకువచ్చాం. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సద్వినియోగం చేసుకునేలా వ్యవహరించాం. ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లులు తీసుకువచ్చాం.
రాష్ట్రానికి 13 విద్యాసంస్థలు కేటాయిస్తే అన్నింటినీ వికేంద్రీకరణ చేశాం. విట్, ఎస్ఆర్ఎమ్, ఎయిమ్స్ అమరావతికి, ఐఐటీ తిరుపతికి, ఐఐఎం విశాఖకు వచ్చాయి. సెంట్రల్ యూనివర్శిటీ అనంతపూర్ కు, ట్రైబల్ యూనివర్శిటీ విజయనగరానికి, ట్రిపుల్ ఐటీ కర్నూలుకు, పశ్చిమ గోదావరికి ఎన్ఐటీ వచ్చాయి. వికేంద్రీకరణతో మేం ఇంతటి అభివృద్ధికి బాటలు వేస్తే, ఇప్పుడువన్నీ పోయాయి. రిలయన్స్, లులూ, పేపర్ మిల్, అదానీ అన్నీ పోయాయి. ఇప్పటివరకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు, ఆదాయం లేదు" అంటూ పేర్కొన్నారు.