Hyderabad: బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పునఃప్రారంభం.. సెల్ఫీలు దిగితే జరిమానా
- కారు ప్రమాదం తర్వాత 43 రోజుల పాటు ఫ్లై ఓవర్ మూసివేత
- నేటి నుంచి దీనిపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభం
- కెమెరాలు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ వంతెనపై వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. గతంలో దానిని ప్రారంభించిన కొన్ని రోజుల వ్యవధిలో వరుసగా ప్రమాదాలు జరగడంతో దాన్ని తాత్కాలికంగా మూసేసిన విషయం తెలిసిందే.
అధికారులతో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ ఫ్లైఓవర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ వంతెన నిర్మాణంలో ఎలాంటి లోపాలు లేవన్నారు. కారు ప్రమాదం జరిగిన తర్వాత 43 రోజుల పాటు ఫ్లై ఓవర్ ను మూసేశామని చెప్పారు. నేటి నుంచి దీనిపై వాహనాల రాకపోకలను పునఃప్రారంభించినట్లు తెలిపారు.
నిపుణుల కమిటీ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక్కడ మంచి వాతావరణం ఉండడంతో కొందరు సెల్ఫీలు దిగుతున్నారని, సెల్ఫీలు దిగకుండా సైడ్ వాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సెల్పీలు దిగితే జరిమానా విధిస్తామన్నారు. ఇక్కడ కెమెరాలు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.