Crime News: పార్ట్ టైం జాబ్ పేరుతో పుట్టి ముంచారు.. రూ.2.04 లక్షలకు టోకరా!
- నిరుద్యోగిని దోచేసిన సైబర్ నేరగాళ్లు
- లింక్ పంపి లైక్ కొట్టించారు
- ఆ తర్వాత దఫదఫాలుగా దోచేశారు
ఇంట్లో కూర్చుని నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చన్న అతని ఆశ మొదటికే మోసం తెచ్చింది. పార్ట్ టైం ఉద్యోగం పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు చిక్కి ఏకంగా 2 లక్షల నాలుగువేల రూపాయలు పోగొట్టుకున్నాడు.
రాచకొండ సైబర్ క్రైం పోలీసుల కథనం మేరకు... భువనగిరికి చెందిన ఓ వ్యక్తి (26)కి గత ఏడాది నవంబరులో లైకీ మొబైల్ అప్లికేషన్లో 'యునైటెడ్ లవ్' అనే వీడియో లింక్ కనిపించడంతో ఓపెన్ చేశాడు. వీడియో నచ్చడంతో లైక్ కొట్టాడు. తర్వాత నవంబరు 19న అతనికి 83178 56348 నంబర్ నుంచి కాల్ వచ్చింది.
తన పేరు నేహా అని, తాను యునైటెడ్ లవ్ ఎగ్జిక్యూటివ్ ని అంటూ హిందీలో పరిచయం చేసుకుంది. తమ సంస్థ తరపున పార్ట్ టైం జాబ్ అవకాశం కల్పిస్తున్నామని, జీతం రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వస్తుందని చెప్పింది. ఇందుకోసం ముందు రూ.10వేలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలంది.
ఎస్ బీఐ అకౌంట్ లో జమ చేయాలని చెప్పగానే బాధితుడు గూగుల్ పే చేశాడు. ఆ తర్వాత దఫదఫాలుగా డిసెంబరు 9 వరకు పలుమార్లు కాల్స్ చేసి, దానికోసం, దీని కోసం డబ్బు చెల్లించాలంటూ చెప్పడంతో ఉపాధి లభిస్తుందన్న ఆశతో రూ.2.04 లక్షల వరకు చెల్లించాడు.
ఎప్పటికీ ఉద్యోగం ఇవ్వకపోవడం, పదేపదే డబ్బులు గుంజేస్తుండడంతో అనుమానం వచ్చిన సదరు వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.