Onions: ఉల్లి లొల్లి ఇక తొలగినట్టే.. సాధారణ స్థితికి చేరుతున్న ధర!
- హోల్ సేల్ మార్కెట్లో కిలో రూ.50కి అటూ ఇటూ
- బహిరంగ మార్కెట్లో రూ.60 వరకు
- సంక్రాంతి నాటికి సగానికి తగ్గుతుందని అంచనా
సంక్రాంతి పండుగ ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరటనిచ్చే వార్త. ఉల్లి ధర దిగివచ్చింది. పండగ నాటికి సాధారణ స్థితికి చేరుకునేలా ఉంది పరిస్థితి. గడచిన నెలరోజులుగా ఉల్లి ఘాటు బెంబేలెత్తించింది. ధర సామాన్య వినియోగదారుడిని పరుగులెత్తించింది. రైతు బజార్లలో చాంతాడంత క్యూలో నిలబెట్టింది. ఉల్లి కొనలేం, తినలేం అన్న పరిస్థితుల్లో చాలామంది ఉల్లి వినియోగాన్నే మానేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉల్లి ఐటమ్స్ కు రాంరాం చెప్పేశాయి.
భారీ వరదలు, వర్షాలతో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి రావాల్సిన సరుకు దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పంట డిమాండ్ కు తగ్గట్టు లేకపోవడంతో ఒక దశలో ఉల్లి కిలో రూ.200 వరకు చేరింది.
దీంతో నాలుగు వారాలపాటు జనం బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని హెూల్ సేల్ మార్కెట్లలో ఉల్లి క్వింటాల్ కు రూ.5 వేలకు అటూ ఇటూగా ఉండడం, బహిరంగ మార్కెట్లో రూ.60ల వద్ద అమ్ముడవుతుండడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.
రెండు మూడు రోజుల్లో ఉల్లి ధర రూ.30 దిగి వస్తుందని, పండగనాటికి రూ.20లు అయినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు. స్థానికంగా పంట చేతికి రావడం, మహారాష్ట్ర నుంచి రబీ పంట దిగుమతి అవుతుండడం, ఈజిప్ట్ నుంచి భారీగా కేంద్రం ఉల్లి దిగుమతులు చేసుకోవడం వంటి కారణాలు ఉల్లి ధర తగ్గడానికి దోహదపడ్డాయి.