Donald Trump: న్యూ ఢిల్లీలో ఉగ్రదాడికి సులేమనీ కుట్ర పన్నాడు.. చంపేశాం: ట్రంప్ కీలక ప్రకటన
- ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతిని హతమార్చిన అమెరికా
- ప్రజలపై దాడులు చేసిన ఘటనల్లో ముఖ్య పాత్ర పోషించాడన్న ట్రంప్
- అమెరికా పౌరులపై జరిపిన దాడుల్లోనూ ఆయన పాత్ర ఉందని వ్యాఖ్య
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడి చేసి ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులేమనీను చంపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమర్శలు వస్తోన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. నిన్న ఆయన ఓ కార్యక్రమంలో దీనిపై స్పందించి పలు వివరాలు తెలిపారు.
భారత్ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రదాడులకు ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధిపతి జనరల్ ఖాసీం సులేమనీ కుట్ర పన్నాడని ట్రంప్ అన్నారు. అతడు లక్షలాది మంది ప్రజలపై దాడులు చేసిన ఘటనల్లో ముఖ్య పాత్ర పోషించాడని చెప్పారు. ఇరాక్ లో అమెరికా పౌరులపై జరిపిన దాడుల్లోనూ ఆయన పాత్ర ఉందని అన్నారు. న్యూఢిల్లీ, లండన్ లలో ఉగ్ర దాడులకు ఆయన కుట్రలు పన్నాడని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆయన చేయబోయే దాడులను అడ్డుకోవడం కోసమే తాము అతడిని హతమార్చినట్లు వివరించారు.
అమెరికా పౌరులను కాపాడుకోవడంలో భాగంగానే దాడి చేసినట్లు చెప్పారు. తమ దేశ దౌత్యాధికారులు, సైనికులే లక్ష్యంగా సులేమనీ దాడులకు సిద్ధమవుతున్నట్లు గుర్తించామని చెప్పారు. అందుకే అతడిని హతమార్చాల్సి వచ్చిందన్నారు. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ముట్టడితో పాటు ఇరాక్‌లోని తమ దేశ మిత్రపక్షాల సైనిక స్థావరాలపై దాడులకు అతడే సూత్రధారని ట్రంప్ చెప్పారు.
తమ దౌత్యాధికారులు, సైనికులపై చేయబోయే మరిన్ని దాడులను అడ్డుకోవాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. యుద్ధాన్ని ఆపడం కోసమే తాము ఈ చర్య తీసుకున్నామని, అంతేగానీ యుద్ధాన్ని ప్రారంభించడం కోసం కాదని చెప్పుకొచ్చారు.
ఇరాన్ ప్రజల పట్ల తమకు అమితమైన గౌరవం ఉందని చెప్పారు. లండన్ నుంచి న్యూఢిల్లీ వరకు సులేమనీ ఉగ్రదాడుల కోసం ప్రణాళికలు వేశాడని తెలిపారు. గొప్ప చరిత్ర, అత్యంత సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా ఇరాన్ ప్రజలను ఆయన అభివర్ణించారు.
ఇరాన్లో శాంతి సామరస్యం కోరుకునే ప్రజల చేతుల్లోనే ఆ దేశ భవిష్యత్తు ఉందని ట్రంప్ చెప్పారు. కాగా, ఇరాన్ ఎన్నడూ యుద్ధాల్లో గెలవలేదని, అయితే చర్చల్లో మాత్రం ఎప్పుడూ ఓడిపోలేదని ఆయన అనడం గమనార్హం. అమెరికా చేసిన దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అమెరికా రాకెట్ దాడులు చేస్తోన్న నేపథ్యంలో ఇరాక్ సేనలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలను పంపింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి.