Banglur: రూ.300 కోట్ల భవనం... తృణప్రాయంగా దానం!
- ఓ అమ్మ దయా గుణం
- బాలల ఆరోగ్య కేంద్రంగా మార్పు
- హర్షాతిరేకాలు వ్యక్తం
దాతృత్వానికి పెద్ద మనసుండాలి. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు...జీవితంలో ఎంతమందికి సాయం చేశామన్నదే చరిత్రలో నిలిచిపోతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల ఆస్తిని తృణ ప్రాయంగా బాలల సంక్షేమానికి కట్టబెట్టి ఆ తల్లి తన గొప్ప మనసును చాటుకుంది.
వివరాల్లోకి వెళితే...బెంగళూరుకు చెందిన మీరానాయుడుకు మెజస్టిక్ బస్ స్టాండు సమీపం గాంధీనగర్లో విశాలమైన స్థలం, అందులో మూడు అంతస్తుల భవనం ఉంది. ఇది ఒకప్పుడు లక్ష్మీ హోటల్ గా పేరుగాంచింది. మొదట్లో ప్రముఖ సినీ నటులు రాజకుమార్, విష్ణువర్ధన్ వంటి వారికి అది ప్రియమైన హోటల్. దీని విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.300 కోట్ల పైమాటే అంటున్నారు.
ఇక్కడ వాణిజ్య సముదాయం నిర్మించుకునేందుకు ఎంతోమంది రియల్టర్లు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చినా మీరా నాయుడు సున్నితంగా తిరస్కరించారు. 'ఇప్పటికే ఉన్న డబ్బుకు ఈ అదనంగా వచ్చే డబ్బు చేరితే ఏం చేసుకుంటాను? ఆ సంపద పెరుగుతుంది అంతేకదా. అంతకంటే ఓ మంచి పని చేయాలనుకుంటున్నా' అంటూ చెప్పిన ఆమె చెప్పినట్టే ఆ భవనాన్ని, స్థలాన్ని క్యాన్సర్ పీడిత బాలల ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు.
నగరంలోని శంకర్ ఆసుపత్రి క్యాన్సర్ పీడితులకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తోంది. అటువంటి ఆసుపత్రికి సాయం చేస్తే మరింత మంది పేదలకు సేవలందుతాయన్న ఉద్దేశంతో మీరానాయుడు తన కోట్ల విలువైన భవనాన్ని ఆ ఆసుపత్రి నిర్వాహకులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ మూడు అంతస్తుల భవనంలో 32 గదులు ఉన్నాయి. ప్రతి అంతస్తులో కొత్తగా వంటశాల నిర్మిస్తారు.
'చికిత్స కోసం వచ్చే బాలలు, వారి తల్లిదండ్రులకు ఈ భవనంలో ఉచితంగా ఆశ్రయం ఇస్తారు. చికిత్స పూర్తయ్యే వరకు అక్కడే ఉండి వెళ్లేందుకు వారికి ఇది ఎంతో సహాయకారి అవుతుంది' అని మీరానాయుడు తెలిపారు.
ఎంత గొప్పగా, విలాసవంతంగా బతికినా పోయేటప్పుడు పదిమంది మన గురించి మాట్లాడుకుని నాలుగు కన్నీటి చుక్కలు రాల్చితేనే ఆ జీవితం ధన్యమైనట్టు. బతికున్నప్పుడు చేసే మంచి పనులే ఇందుకు దోహదపడతాయి. హ్యాట్సాఫ్ టు మీరా నాయుడు.