Amaravati: మూడు ప్రాంతాల్లో అలజడి సృష్టించాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోంది : సీపీఐ నారాయణ ఫైర్
- రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలనే హక్కు ‘సీమ’ ప్రజలకు ఉంది
- అమరావతి నుంచి రాజధాని తరలిస్తే సీమ ప్రజలకు ఇబ్బంది
- వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయి
రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని అడిగే హక్కు రాయలసీమ ప్రజలకు ఉందని సీపీఐ నారాయణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఒకప్పుడు కర్నూలు రాజధానిగా ఉంది కనుక ఇప్పుడు కూడా క్యాపిటల్ ఇక్కడే ఏర్పాటు చేయాలని వారు కోరడంలో తప్పులేదని చెప్పారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని ప్రభుత్వం చెబుతుండటం బాగుంది కానీ, అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేస్తామని చెప్పడం బాగోలేదని అంటూ విమర్శలు చేశారు. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ప్రయత్నిస్తే రాయలసీమ ప్రజలు అక్కడికి వెళ్లాలంటే చాలా ఇబ్బంది అని అభిప్రాయపడ్డారు.
మూడు ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకాన్ని ‘కెలికి’, అలజడి సృష్టించాలని చూస్తున్న ప్రభుత్వం చేపలు పట్టాలని చూస్తోందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తీరుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయని మండిపడ్డారు.