Irfan Pathan: అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్
- ఇర్ఫాన్ పఠాన్ రిటైర్మెంటు ప్రకటన
- ఆల్ రౌండర్ గా గుర్తింపు
- 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం
టీమిండియాలో అనేక సంవత్సరాల పాటు ఆల్ రౌండర్ గా సేవలు అందించిన ఎడమచేతివాటం క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆటకు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. బరోడాకు చెందిన ఇర్ఫాన్ 120 వన్డేలు ఆడి 173 వికెట్లు పడగొట్టాడు. 29 టెస్టుల్లో 100 వికెట్లు సాధించాడు. అటు బ్యాటింగ్ లో వన్డేల్లో 1544, టెస్టుల్లో 1105 పరుగులు నమోదు చేశాడు.
ఇర్ఫాన్ పఠాన్ 19 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలినాళ్లలో సంచలన క్రికెటర్ గా పేరుతెచ్చుకున్నా, ఆ తర్వాత నిలకడలేమితో జట్టులో స్థానం కోల్పోయాడు. పలు పర్యాయాలు పునరాగమనం చేసినా తనదైన ముద్రవేయలేకపోయాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2017లో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. అప్పటినుంచి వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇర్ఫాన్ పఠాన్ కొంతకాలంగా జమ్మూకశ్మీర్ రంజీ జట్టు కోచింగ్ బాధ్యతల్లో పాలుపంచుకుంటున్నాడు.