CPI Narayana: అధికార వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమన్నది ‘రాంగ్ కాన్సెప్ట్’: సీపీఐ నారాయణ
- ఆంధ్రా రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు
- ‘సీమ’కు చెందిన వ్యక్తులే ఎక్కువ సీఎంలుగా చేశారు
- అయినా అభివృద్ధి చేయలేకపోయారు
అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందన్న రాంగ్ ‘కాన్సెప్ట్’ ని ప్రజానీకానికి నూరిపోస్తున్నారని, కొంతమంది అమాయకులు నమ్ముతున్నారని వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ విమర్శలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వాస్తవానికి, అధికార వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.
సమస్య కాని సమస్యను తీసుకొచ్చి అభివృద్ధి కావాల్సిన ఆంధ్ర రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తులే ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ ‘సీమ’ను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు, ఫ్యాక్షనిజం ఎందుకు పెరుగుతోందనే విషయాలపై గతంలో తాము అధ్యయనం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఇరవై ఐదేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గురించి నారాయణ ప్రస్తావించారు. ‘కర్నూలులో మా వాళ్లను అరెస్టు చేశారని ఓసారి ఓ ఎస్పీ దగ్గరకు పోయినప్పుడు ఆయన లెక్కలు తీశారు. వర్షాకాలం స్టార్ట్ అయితే ఎన్ని కేసులు నమోదవుతున్నాయో, ఎండాకాలం వచ్చినప్పుడు ఎన్ని కేసులు నమోదవుతున్నాయో లెక్కలు చూపించారు. ఇప్పుడు పది అయితే, అప్పుడు వంద అవుతున్నాయి. ‘పనేమి ఉండదు.. కొట్లాడుకుంటున్నారు.. నీళ్లు తెప్పించండయ్యా ముందర’ అని ఇరవై ఐదేళ్ల క్రితం సీకే రెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు చెప్పాడు’ అని గుర్తుచేసుకున్నారు.