Andhra Pradesh: వీళ్లు రైతులే అయితే ఆడి కార్లు, ఖద్దరు షర్టులు, చేతికి బంగారు గాజులు ఎలా ఉంటాయి?: వైసీపీ నేత పృథ్వీరాజ్
- కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఉద్యమం అంటూ విమర్శలు
- పెయిడ్ ఆర్టిస్టులంటూ వ్యాఖ్యలు
- పవన్ కు ఇలాంటివి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం
ఏపీ రాజధాని మార్పుపై అమరావతిలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలపై ప్రముఖ నటుడు, వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ స్పందించారు. అమరావతిలో రైతుల పేరుతో ఉద్యమం చేస్తున్నది పెయిడ్ ఆర్టిస్టులేనని ఆరోపించారు. వీళ్లంతా రైతులే అయితే ఆడి కార్లు, ఖద్దరు షర్టులు, చేతికి బంగారు గాజులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.
ఇది కార్పొరేట్ ముసుగులో సాగుతున్న రైతు ఉద్యమం అని అన్నారు. పవన్ కల్యాణ్ కు ఇలాంటివి కనపడడం లేదా? అంటూ జనసేనానిని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక తిరుమలలో అన్యమత ప్రచారం గురించి చెబుతూ, తిరుమలలో ఇతర మతాలకు చెందిన ప్రచారం జరుగుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని అన్నారు.