Jagan: జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లలో ఎవరికీ కులపిచ్చి లేదు: సినీ నటుడు శివాజీ
- ప్రజలే మూర్ఖులని వ్యాఖ్యానించిన శివాజీ
- రాజధాని పరిణామాలు ముందే ఊహించినట్టు వెల్లడి
- చంద్రబాబు తనకు ప్యాకేజీ ఇవ్వలేదని స్పష్టీకరణ
రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది, రాజధాని ఇక్కడ ఉండదు, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు... వంటి అంశాలన్నీ తాము ముందుగానే ఊహించామని నటుడు శివాజీ తెలిపారు. రాజధాని అంశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. ఓ వార్తా చానల్ స్టూడియోకు విచ్చేసిన శివాజీ తన అభిప్రాయాలు వెల్లడించారు. పనీపాటా లేని వాళ్లు తనకు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చినట్టు ఆరోపణలు చేస్తుంటారని, తనకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం కూడా లేదని స్పష్టం చేశారు.
రాజకీయ పార్టీలన్నీ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు. రాజధానిలో ప్రస్తుత పరిస్థితికి ప్రజలది కూడా బాధ్యత ఉందని అన్నారు. ప్రత్యేకహోదాపై జగన్ ను ప్రశ్నించని ప్రజలు, ఇప్పుడు తమకు బాధ కలిగేసరికి అమరావతి విషయంలో ఎలుగెత్తుతున్నారని శివాజీ పేర్కొన్నారు. రాజధానిలో 29 గ్రామాల చుట్టూ ఉన్న గ్రామాల్లో భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని, కానీ ఇవాళ ఒక్కరు కూడా రాజధాని గ్రామాల రైతులకు మద్దతుగా రావడంలేదని అన్నారు.
ప్రస్తుతం కులగజ్జి విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. "జగన్ గానీ, చంద్రబాబు గానీ, పవన్ కల్యాణ్ గానీ వారి వారి కులాల్లో ఒక్కరికీ కూడా మేలు చెయ్యరు... మూర్ఖులారా దయచేసి ఇది గమనించండి. గత ఏడేళ్లుగా ఇదే చెబుతున్నాం. ఈ రాజకీయ పార్టీల నేతలు కులాల మీద వ్యాపారాలు చేసుకుంటున్నారు తప్ప ఎవరికీ ప్రయోజనం కల్పించేందుకు కాదు. ఆ ముగ్గురిలో ఎవరికీ కులపిచ్చి లేదు. ప్రజలు ఆ విషయం గ్రహించాలి. కుల గజ్జి, కేసుల భయంతోనే అమరావతి కోసం పోరాటాలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు" అంటూ శివాజీ వ్యాఖ్యానించారు.