Tirumala: 24 గంటలూ తిరుమలపైకి వాహనాలకు అనుమతి: ఈఓ అనిల్ సింఘాల్
- రేపు వైకుంఠ ఏకాదశి
- ఇప్పటికే వేచివున్న 40 వేల మంది భక్తులు
- ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఈఓ
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమల ఘాట్ రోడ్లపైకి వచ్చే మూడు రోజుల పాటు 24 గంటలూ వాహనాలను అనుమతించనున్నట్టు టీటీడీ ఈఓ అనిల్ సింఘాల్ వెల్లడించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ పండగ రోజున లక్షలాది మంది భక్తులు స్వామి దర్శనానికి తరలి వస్తారని అంచనా వేస్తున్నామని, నేటి అర్థరాత్రి తరువాత 2 గంటల సమయంలో వైకుంఠ ద్వారాలను తెరుస్తామని స్పష్టం చేశారు.
వీవీఐపీ, వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాల అనంతరం సామాన్య భక్తులకు స్వామి దర్శనం చేయిస్తామని తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకూ స్వామివారి స్వర్ణరథం ఊరేగింపు ఉంటుందన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుందని, భక్తుల రద్దీ దృష్ట్యా, 7వ తేదీ వరకూ సర్వదర్శనం మినహా మిగతా అన్ని రకాల ప్రత్యేక దర్శనాలనూ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
నిర్విరామంగా అన్న ప్రసాద వితరణ ఉంటుందని, భక్తుల కోసం 3 లక్షల వాటర్ బాటిళ్లను సిద్ధంగా ఉంచామని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ దాతలకు మాత్రం మహా లఘు దర్శనం ఉంటుందని వెల్లడించారు. కాగా, రేపటి వైకుంఠ ద్వార దర్శనం నిమిత్తం నారాయణ గిరి షెడ్లలో ఇప్పటికే 40 వేల మందికి పైగా భక్తులు వేచివున్నారు. వీరిని ఇంకా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనికి అనుమతించలేదు.