Vijayashanti: నేను పిల్లలను వద్దనుకున్న కారణమిదే: విజయశాంతి
- 13 ఏళ్ల తరువాత సెకండ్ ఇన్నింగ్స్
- పిల్లలు కంటే స్వార్థం పెరుగుతుంది
- భర్తతో చర్చించిన మీదటే పిల్లలు వద్దని నిర్ణయం
దాదాపు 13 సంవత్సరాల తరువాత 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్న విజయశాంతి, సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. పిల్లలంటే తనకెంతో ఇష్టమని, పిల్లలను కంటే, తనలో స్వార్థం పెరుగుతుందని ఆలోచించిన మీదటే, పిల్లలను కనరాదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత 'నా' అన్న స్వార్థం స్థానంలో, 'మన' అన్న ధోరణితో సాగాలని భావించానని, తనను ఈ స్థాయికి తీసుకుని వచ్చిన ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనకు తన భర్త శ్రీనివాస ప్రసాద్ నుంచి ప్రోత్సహం లభించిందని, ఇద్దరమూ కలిసే పిల్లలు వద్దని నిర్ణయించుకున్నామని చెప్పారు.
అనుకోకుండా శ్రీనివాస ప్రసాద్ తో పరిచయం ఏర్పడిందని, ఒకరి అభిప్రాయాలు మరొకరితో పంచుకున్న తరువాత, కోట్లు ఖర్చు పెట్టి, పెద్ద పెద్ద మండపాలు వేసి పెళ్లి చేసుకోవాలని భావించలేదని, సింపుల్ గా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నామని, స్నేహితుల సమక్షంలో తన మెడలో ఆయన తాళి కట్టారని, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని చెప్పారు. తనకు ఇందిరా గాంధీ, జయలలితల్లాగా అవాలన్న కోరిక ఉందని విజయశాంతి వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం తనకు రాజకీయాలే ముఖ్యమని, వరుసగా సినిమాలు చేసే ఉద్దేశం లేదని, బాగా నచ్చితే, ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రం చేసే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.