Potato Price: ఉల్లి లొల్లి తగ్గింది...బంగాళాదుంపలు బంగారమాయే!
- మూడు రోజుల వ్యవధిలో రెట్టింపైన ధర
- నిలిచిపోయిన ఉత్తరప్రదేశ్ దిగుమతులు
- స్థానిక పంట అందుబాటులో లేకపోవడం కారణం
డిసెంబరులో ఉల్లి ఘాటు ఏ రేంజ్ లో ఉందో తెలిసిందేగా. డబుల్ సెంచరీని తాకి వినియోగదారులను బెంబేలెత్తించింది. ఇప్పుడిప్పుడే ఆఫ్ సెంచరీ దిశగా దిగివస్తోంది. కొత్త పంట అందుబాటులోకి వస్తుండడంతో ఇక ఉల్లి లొల్లి ఉండదని చెప్పొచ్చు. కానీ, పండగ ముందు బంగాళా దుంపలు (ఆలూ) ఆ మార్గం పడతాయేమోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ప్రస్తుతం ఆలూ కిలో రూ.40 పలుకుతోంది. షాపింగ్ మాల్స్ లో ఇంకా ఎక్కువే.
విశాఖ వంటి నగరాల్లో రూ.30 చుట్టూ తిరుగుతోంది. ఇదేం పెద్ద విశేషం అనుకోవచ్చు. కానీ గడచిన వారం రోజుల్లో బంగాళా దుంపల ధర రెట్టింపు కావడమే ఆందోళనకు అసలు కారణం. దేశంలోని మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బంగాళా దుంపల సాగు అధికంగా ఉంటుంది. ఖరీఫ్, రబీ పంటగా పం డిస్తారు.
అక్టోబర్, నవంబర్ లో వేసే పంట డిసెంబరు, జనవరి నాటికి అందుబాటులోకి వస్తుంది. పంట అం దుబాటులోకి వచ్చినా ధర ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వలు దాచుకునేందుకు ఇష్టపడుతుండడంతో తెలుగు రాష్ట్రాలకు బంగాళా దుంపల దిగుమతులు తగ్గిపోయాయి. ఇదే ధరపై ప్రభావం చూపిస్తోందంటున్నారు.
స్థానిక హోల్ సేల్ వర్తకుల వద్ద ఉన్న అరకొర నిల్వలు అయిపోవడం, అనుకున్న మేర ఆగ్రా తదితర హోల్ సేల్ మార్కెట్ల నుంచి బంగాళా దుంపలు దిగుమతి కాకపోవడంతో గడచిన మూడు రోజుల్లోనే ధర రెట్టింపు అయ్యింది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకా ధర పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
అయితే, ఉల్లిపాయల్లా రోజూ వాడేవి కాదని, పైగా ధర ఎక్కువగా ఉంటే వాటిని కొనకుండా ప్రత్యామ్నాయంగా మరో రకం కూరగాయలు కొనుక్కునే అవకాశం ఉన్నందున ఉల్లికోసం భయపడాల్సినంత అవసరం లేదని వ్యాపారులు చెబుతున్నారు.