Amaravati: అమరావతి, విశాఖలను పోల్చి చూస్తే ‘సున్నా’కు ‘వంద’కు ఉన్నంత తేడా ఉంది: మంత్రి బొత్స
- విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం
- దేశంలోని పది నగరాలను తీసుకుంటే అందులో ఇదొకటి
- విశాఖతో అమరావతిని పోలిస్తే ఎలా?
రాజధాని అమరావతి, కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని యోచిస్తున్న విశాఖను పోల్చి చూస్తే కనుక ‘సున్నా’కు ‘వంద’కు ఉన్నంత తేడా ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, విశాఖ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం అని, దేశంలో అభివృద్ధి చెందిన పది నగరాలను తీసుకుంటే అందులో వైజాగ్ ఒకటి అని అన్నారు. విశాఖతో అమరావతిని పోలిస్తే ఎలా? ఇంకొంచెం అభివృద్ధి చేస్తే కనుక హైదరాబాద్ ను తలదన్నే సిటీగా విశాఖ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
విశాఖకు బదులు తుళ్లూరులో హైటెక్ సిటీ ఏర్పాటు చేస్తే ఎవరైనా వస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలను అభివృద్ధి చేయడం అవసరమేనని, ఆయా జిల్లాల్లో ప్రజల అవసరాలను గుర్తించాలని అన్నారు. రాయలసీమ ప్రాంతం కరవుతో ఉంటుందని, అక్కడ నీరు కావాలని, ఉత్తరాంధ్ర ప్రాంతంలో అయితే మౌలికసదుపాయాల కల్పన, నిరక్షరాస్యత, నిరుద్యోగ సమస్య, గోదావరి జిల్లాల్లో అయితే నది అక్కడే ఉంది కానీ తాగేందుకు మంచినీరు ఉండవని.. ఇలా ప్రతి జిల్లాలో ఏదో ఓ సమస్య ఉందని అన్నారు.