Chandrababu: కమిటీ సభ్యులను విమర్శించే బదులు... జరిగిన తప్పిదాలను సమీక్షించుకోవాలి: చంద్రబాబుకు ఐవైఆర్ కృష్ణారావు సూచన
- పాలనా రాజధానిని కాకుండా.. మహానగరాన్ని ఎందుకు నిర్మించాలనుకున్నారు?
- ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ.. వేలాది ఎకరాలు ఎందుకు సేకరించారు?
- శ్రీభాగ్ ఒప్పందాన్ని ఎందుకు పట్టించుకోలేదు?
రాజధాని అంశంపై ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపులు నివేదికలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. కమిటీ సభ్యులను విమర్శించే బదులు అమరావతి ప్రణాళికలో తప్పిదాలు ఎక్కడ జరిగాయి? అనేది సమీక్షించుకుంటే బాగుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించారు.
- పరిపాలన రాజధాని సరిపోయే పరిస్థితులలో మహా నగర నిర్మాణానికి పూనుకోవడం ఎంతవరకు సమంజసం?
- మహా నగర నిర్మాణానికి ఎంచుకొన్న స్థలం సరైనదా?
- నిర్మాణానికి కావలసిన వనరుల గురించి సరైన అధ్యయనం జరిగిందా?
- ప్రభుత్వ స్థలాలు కావలసినంత లభ్యంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భూ సమీకరణ చేసి రైతుల భవిష్యత్తును రాజధానితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైవిధ్యాన్ని, శ్రీభాగ్ ఒప్పందంలాంటి చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర రాజధానిని ఏ విధంగా నిర్ణయిస్తారు?
- ఒక మహా నగర నిర్మాణం ద్వారా రాష్ట్ర వనరులన్నీ కొద్ది ప్రాంతంలో కేంద్రీకృతం అయితే మిగిలిన ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేది ఎలా?
ఆరోజు శివరామకృష్ణన్ కమిటీ గాని, ఈరోజు జీఎన్ రావు కమిటీ గాని (జీఎన్ రావు గారు కమిటీ కన్వీనర్ చైర్మన్ కాదు), బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కానీ ఈ అంశాలనే ప్రస్తావించి పరిష్కారాలను సూచిస్తున్నాయని ఐవైఆర్ అన్నారు.