Mohan Babu: బీజేపీలోకి వెళ్లేందుకు మోహన్ బాబు సన్నాహాలు..?
- మోదీతో భేటీ అయిన మోహన్ బాబు
- మోహన్ బాబును బీజేపీలోకి ఆహ్వానించిన మోదీ!
- మోహన్ బాబు సానుకూల స్పందన
రాజకీయాల్లో వారు వీరవడం, వీరు వారవడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారింది. పార్టీలు మారడం పట్ల నిశ్చితాభిప్రాయాలకు కాలం చెల్లింది. అసలు విషయానికొస్తే... సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు బీజేపీలో చేరనున్నట్టు టాక్ వినిపిస్తోంది. నేడు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో మోహన్ బాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మీప్రసన్నలతో కలిసి మోహన్ బాబు ప్రధానితో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీలోకి రావాలంటూ మోదీ ఆహ్వానం పలకగా, మోహన్ బాబు కూడా ఆ ప్రతిపాదనను వ్యతిరేకించలేదని తెలుస్తోంది. మోదీతో భేటీకి కొనసాగింపుగా త్వరలోనే అమిత్ షాను కూడా మోహన్ బాబు కలవనుండడం బీజేపీలోకి మంచువారి ఎంట్రీ ఖాయంగానే కనిపిస్తోంది.
ఎన్నికలకుముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు ప్రచారంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకలాపాల్లో మోహన్ బాబు ఉనికి పెద్దగా కనిపించలేదు. కాగా ప్రధానితో భేటీ తర్వాత మంచు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. మోదీని ఆకాశానికెత్తేస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. డైనమిక్ ప్రధానిని కలిశామని, మోదీ సారథ్యంలో భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని పేర్కొన్నారు.