Ala Vaikunthapuramulo: మనసు దురద పెడితే గోక్కునే దువ్వెన లాంటిది సంగీతం: త్రివిక్రమ్
- అల... వైకుంఠపురములో ప్రీరిలీజ్ ఈవెంట్
- హైదరాబాదు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో వేడుక
- తనదైన శైలిలో ప్రసంగించిన త్రివిక్రమ్
హైదరాబాదులోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో అల... వైకుంఠపురములో చిత్ర మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ సినిమాలో ప్రతి పాట వెనుక ఎంతోమంది కృషి దాగివుందని అన్నారు. "రెండు పదాలే అన్న శ్యామ్ గారు రాములో రాములా పాటను ఎక్కడికో తీసుకెళ్లారు. ఓ మైగాడ్ డాడీ అన్న కృష్ణచైతన్య, ఓ సందర్భం గురించి ఫోన్ లో చెప్పగానే ర్యాప్ వెర్షన్ రాసి పాడి ఫోన్ లో పంపిన రోల్ రైడాను అభినందిస్తున్నాను. ఇక సంగీతం గురించి నా అభిప్రాయం చెబితే నవ్వు రావొచ్చేమో కానీ చెబుతాను. మనసు దురద పెడితే గోక్కునే దువ్వెన లాంటిది సంగీతం. తల దురదపెడితే గోక్కోవడానికి దువ్వెన ఉంటుంది కానీ మనసుకు దురదపెడితే దేనితో గోక్కోగలం... సంగీతంతో తప్ప!" అంటూ ప్రసంగించారు.
హీరో అల్లు అర్జున్ గురించి చెబుతూ, బన్నీ బ్యాచిలర్ గా ఉన్నప్పటి నుంచే తెలుసని, ఇప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రిగా మరింత పరిణతితో ముందుకు వెళుతున్నాడని కితాబిచ్చారు. తన శ్రేయోభిలాషి సిరివెన్నెల సీతారామశాస్త్రిని త్రివిక్రమ్ ఆకాశానికెత్తేశారు. సినిమా గీత రచయితకు సాహితీవేత్త స్థాయి కల్పించిన రచయిత అని కొనియాడారు. ఒకటి నుంచి పది స్థానాలు ఆయనవేనని, ఆ తర్వాత 11 నుంచే ఇతర గీత రచయితలు ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే ఇతర గీత రచయితలు కూడా సిరివెన్నెల సరసన నిలవాలని, తప్పకుండా నిలుస్తారని ఆకాంక్షించారు.