Vizag: విశాఖకు ఏపీ సచివాలయం... భవనాలను వెతుకుతున్న అధికారులు!
- పలు శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు
- అద్దె భవనాల కోసం తిరుగుతున్న ఐఏఎస్ లు
- 20లోగా భవనాలను వెతుక్కునే పనిలో అధికారులు
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని భావిస్తున్న జగన్ ప్రభుత్వం, ఈ మేరకు భవనాలను వెతుక్కోవాలని ఆయా శాఖలకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నెల 20లోగా అద్దె భవనాలను చూసుకోవాలని భావిస్తున్న పలు శాఖాధిపతులు, భవనాలను వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారు.
విజయవాడ, గుంటూరు నగరాలతో పోలిస్తే, విశాఖపట్నంలో భవంతుల అద్దెను చదరపు అడుగుకు రూ. 15 నుంచి రూ. 30 వరకూ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అద్దె రూ. 20 దాటితే మాత్రం ప్రభుత్వ అనుమతి తప్పనిసరని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సచివాలయం కోసం మిలీనియం టవర్ ను ఇప్పటికే ప్రభుత్వం ఎంపిక చేసుకుంది. ఇక నేడు సమావేశమయ్యే హై పవర్ కమిటీ తీసుకునే నిర్ణయం కూడా అందుకు అనుకూలంగానే ఉంటుందని సమాచారం. ఆపై రేపు కేబినెట్ భేటీ కూడా జరుగనుంది. దాని తరువాత ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి, కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు లాంఛన ఆమోదాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక విశాఖలో భవంతులను ఎంపిక చేసుకోవాలని అధికారులకు మౌఖిక ఉత్తర్వులు అందిన నేపథ్యంలో పలువురు ఐఏఎస్ లు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ వచ్చి, ప్రభుత్వ భవనాలు, భూములు ఎక్కడున్నాయో పరిశీలించగా, మార్కెటింగ్ విభాగం కమిషనర్ రుషికొండలోని ఐటీ పార్కులో ఉన్న భవంతులను పరిశీలించారు. పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులు కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు.