Telugudesam: అనుమతి లేకుండా ఇంట్లోకి వస్తారా?: పోలీసులపై బోండా ఉమ ఆగ్రహం
- గృహ నిర్బంధం విధించడం అక్రమం
- రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లడం తప్పా?
- రాజధానికి భూములిచ్చిన రైతులను సీఎం అవమానిస్తున్నారు
అమరావతి రైతుల ఆందోళన తీవ్రతరమైంది. మరోవైపు రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతున్న టీడీపీ ముఖ్యనేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై ఉమ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లడం తప్పా? అని ప్రశ్నించారు. పోలీసులు ఇంటి తలుపులు మూయడాన్ని ఆక్షేపించారు.
అనుమతి లేకుండా పోలీసులు ఇంట్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై ప్రైవేటు కేసులు వేసి, న్యాయస్థానంలో పోరాటం చేస్తానన్నారు. సీఎం జగన్ ఎన్ని కుట్రలు చేసినా.. అమరావతిని కాపాడుకునేవరకు పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానికోసం భూములు ఇచ్చిన రైతులను అవమానపరుస్తోందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ.. బోండా ఉమ ఇంటి ప్రధాన ద్వారం వద్ద వారు బైఠాయించి నిరసన తెలిపారు.