Andhra Pradesh: రైతులకు న్యాయం చేయండని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా?: వైసీపీ సర్కారుపై లోకేశ్ ఫైర్
- రైతుల తరఫున పోరాటం ఆపబోమని స్పష్టీకరణ
- జగన్ నిరంకుశత్వానికి నిదర్శనం అంటూ ఆగ్రహం
- ట్విట్టర్ లో వ్యాఖ్యలు
రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించి ఉద్యమంలో పాల్గొంటున్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయడం తెలిసిందే. మరికొందరు నేతలను గృహనిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం చెయ్యాలని అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు.
లాఠీలతో ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం జగన్ నిరంకుశత్వానికి నిదర్శనం అని విమర్శించారు. వైసీపీ సర్కారు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదంటోందని, కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల తరఫున టీడీపీ పోరాటం ఆగదని లోకేశ్ స్పష్టం చేశారు. రైతుల పోరాటానికి సంఘీభావంగా కదలివచ్చిన లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పీఎస్ కు తరలించిన సంగతి తెలిసిందే.