Amaravati: యుద్ధం, యుద్ధం, యుద్ధం చేద్దమురా.. సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్న ‘అమరావతి’ పాట
- రాజధాని ప్రాంతంలో ఆగని రైతుల ఆందోళనలు
- రాజధానిని తరలించొద్దంటూ పాటలు రాస్తున్న కళాకారులు
- ఉద్యమానికి మరింత ఊపునిస్తున్న పాటలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి తరలింపు అంశం తప్ప మరో చర్చ లేదు. గత నెల 17న అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతి రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ప్రతి రోజూ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. రైతులు అలుపెరగకుండా చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల నుంచి పూర్తి మద్దతు ఉంది. ఇప్పుడు వీరికి మరో మద్దతు కూడా లభించింది. అదే కళాకారుల మద్దతు.
ఉద్యమం చేస్తున్న రైతుల్లో మరింత స్ఫూర్తిని రగిలించడంతోపాటు, వారిలో ఉత్సాహం నింపేలా కళాకారులు తమ గొంతు సవరిస్తున్నారు. రాజధాని తరలింపును అడ్డుకోవాలని, అవసరమైతే యుద్ధం చేద్దామంటూ రైతుల్లో స్ఫూర్తి నింపే పాట ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘యుద్ధం యుద్ధం యుద్ధం చేద్దమురా.. అమరావతి రాజధానికై రణమే చేద్దమురా. సమరం సమరం సమరం సమరం చేద్దమురా.. రాజధాని అమరావతికై పిడికిలి బిగించరా’’ అనే పాట రైతుల నోట వినిపిస్తోంది.