Chambal: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన చంబల్‌లోయ ముఠా.. వణుకుతున్న సంపన్న వర్గాలు!
- కొన్ని నెలల క్రితమే నగరంలో దిగిన ముఠా
- గత నెల 9న బంజారాహిల్స్‌లోని ప్రముఖ వ్యాపారి ఇంట్లో చోరీ
- రూ.3 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీ
సంపన్న వర్గాలే లక్ష్యంగా విజృంభించే చంబల్‌లోయ ముఠా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. సంపన్నుల ఇంట్లో వంట పనివారుగా, పనిమనుషులుగా చేరే ఈ ముఠా సభ్యులు అదును చూసి సొత్తుతో పరారవుతారు. ఢిల్లీ సహా పలు నగరాల్లో భారీ చోరీలకు పాల్పడిన ఈ ముఠా.. హైదరాబాద్‌లో ఇప్పటికే రూ.3 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఘటన తర్వాత నగరంలోని ధనిక వర్గాలు వణికిపోతున్నాయి.
బీహార్‌లోని సిజోల్ ప్రాంతానికి చెందిన రాహుల్ ముకియా అలియాస్ దహూర్ అలియాస్ రాజు (33)తో అతడి ముఠాలోని 10 మంది సభ్యులు కొన్ని నెలల క్రితమే నగరంలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. గత నెల 9న బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ప్రముఖ వ్యాపారి ఇంట్లో జరిగిన భారీ చోరీ వెనక ముకియా ముఠా సభ్యుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వ్యాపారి ఇంట్లో అంతకుముందే పనికి కుదిరిన రాం ఆశిష్ అలియాస్ కరణ్ ముకియా ఏకంగా రూ. 3 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలతో ఉడాయించాడు. ఇది చంబల్‌లోయు ముఠా పనేనని గుర్తించిన పోలీసులు ముఠా సభ్యుల కోసం రంగంలోకి దిగారు.
రాహుల్ ముకియా నగరంలో అడుగుపెట్టడానికి ముందే ముఠా సభ్యుడు బోలా పనిమనుషులను కుదిర్చి పెడతానంటూ బంజారాహిల్స్‌లోని పలువురు సంపన్నులను కలిశాడు. అలా బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో రాహుల్ ముకియాను, రోడ్డు నంబరు 12లోని కపిల్ గుప్తా నివాసంలో రాం ఆశిష్ ముకియాను పనికి కుదిర్చాడు. మిగతా 8 మందిని బంజారాహిల్స్, బేగంపేట, గోపాలపురం, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో పనికి కుదిర్చాడు. ఈ క్రమంలో యజమానులు ఇంట్లో లేని సమయంలో రాం ఆశిష్ భారీ చోరీకి పాల్పడ్డాడు. మొత్తంగా రూ. 3 కోట్ల విలువైన ఆభరణాలతో ముఠా సభ్యులు పరారయ్యారు. అయితే, బోలా పోలీసులకు చిక్కడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఒకప్పుడు గడగడలాడించిన బందిపోటు రాణి పూలన్‌దేవి సంబంధీకులైన రాహుల్ ముకియా, అతడి సోదరుడు సురేశ్ ముకియా (40)లు పదేళ్లుగా ఈ ముఠాను నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠా సభ్యుల్లో భగవత్, బోలా, హరిశ్చంద్ర ముకియాలు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా, కీలక నిందితుడైన రాహుల్ ముకియాతో పాటు మరికొందరు పరారీలో ఉన్నారు.