TRS: మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కదని.. పెట్రోలు పోసుకున్న టీఆర్ఎస్ నాయకుడు
- తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు
- టీఆర్ఎస్ టికెట్ల కోసం ఆశావహుల పోటీ
- మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద ఆశావహుడి ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తెలుసుకున్న టీఆర్ఎస్ ఆశావహుడు పెట్రోలు పోసుకుని హల్చల్ చేశాడు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. దీంతో టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు.
వీరంతా పార్టీ టికెట్ కోసం మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్‌పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి తన కార్యాలయంలో టికెట్లు ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతున్నారు. అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యాడు. ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు.
దీంతో మంత్రి ఇంటి వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది. విషయం తెలిసిన మంత్రి తన ఇంటి వెనక నుంచి వెళ్లిపోయి మల్లారెడ్డి గార్డెన్స్‌కు చేరుకున్నారు. కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని మంత్రి పిలుపు కోసం వేచి చూశారు. దీంతో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడిన మల్లారెడ్డి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.